రెండేళ్ల క్రితం వెలుగు చూసిన కరోనా మహమ్మారి మానవాళిని భయాందోళనలకు గురిచేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతూనే ఉంది. వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా రూపాలను మార్చుకుంటూ ప్రాణాలను కబలిస్తూనే ఉంది. కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ చివరిది కాదని, మరింత ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక విభాగాధిపతి మరియా వాన్ కెర్ఖోవ్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు. కొత్త వేరియంట్లను ‘వైల్డ్‌కార్ట్ ఎంట్రీ’గా ఆమె అభివర్ణించారు. అంతకుముందున్న ఒమిక్రాన్ ఉపవేరియంట్ BA-1 కన్నా.. తాజాగా బయటపడిన ఉపవేరియంట్ BA-2 మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందనని పేర్కొన్నారు. అయితే కొత్త ఇన్‌ఫెక్షన్లకు BA-2 ఉపవేరియంట్ కారణమా? కాదా? అనే అంశంపై ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌ఓ పరిశోధనలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఒమిక్రాన్ వచ్చిన వారికి ఈ ఉపవేరియంట్ మళ్లీ సోకుతుందా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదన్నారు.
‘వైరస్ గురించి మనకు చాలా విషయాలు తెలుసు. కానీ అన్నీ విషయాలు తెలియవు. వైరస్ పరివర్తనం చెందుతూనే ఉంది. ఈ వేరియంట్లన్నీ వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు. ఈ కొత్త ఉపవేరియంట్ కారణంగా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లు రాలేదని ఇప్పటివరకు జరిగిన పరిశోధనల్లో తేలింది. ఒమిక్రాన్ తర్వాత మరో వేరియంట్ వస్తే అది దీనికంటే ఎక్కువ శక్తిసామర్థ్యాలను కలిగిఉండే అవకాశం ఉంది. వీటిని తట్టుకోవాలంటే వ్యాక్సినేషన్ కవరేజ్‌ను పెంచడంతో పాటు వైరస్ కట్టడికి చర్యలు తీసుకోక తప్పదు’ అని మరియా వ్యాఖ్యానించారు
Tags:
International