ఆస్ట్రేలియా క్రికెట్ కోచ్ పదివికి జస్టిన్ లాంగర్ రాజీనామా చేయడంపై ఆ జట్టు టెస్టు సారథి ప్యాట్ కమిన్స్ స్పందించాడు. ఈ విషయంపై మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వారికి సుదీర్ఘ లేఖ రాశాడు. జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది అభిప్రాయాల ప్రకారమే ఆస్ట్రేలియాకు కొత్త కోచ్ అవసరమని తెలిపాడు. కాగా, లాంగర్.. గత ఆదివారం తన పదవి నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించడంతో ఆ క్రికెట్ బోర్డు అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే పలువురు మాజీ క్రికెటర్లు లాంగర్‌కు అనుకూలంగా, కమిన్స్‌కు వ్యతిరేకంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే ఆసీస్ సారథి వీటిపై స్పందించాడు.
‘చాలా మంది మాజీలు నాకు వ్యక్తిగతంగా, బహిరంగంగా పలు సూచనలు చేశారు. ఆటపై మీకున్న ప్రేమ, మీ సహచర ఆటగాడి కోసం మీరంతా ఆ పని చేశారు. అందుకు మీకు ధన్యవాదాలు. అయితే, మీ అందరికీ ఒక విషయం చెప్పదల్చుకున్నా. మీరంతా ఎప్పుడూ మీతోటి ఆటగాళ్లకు ఎలా అండగా ఉన్నారో.. నేనూ ఇప్పుడు నా జట్టు కోసం అలాగే ఉన్నా. లాంగర్ రాజీనామా చేసినప్పటి నుంచి తీవ్ర చర్చ జరుగుతోంది. అదే సమయంలో నేను కూడా ఎలాంటి బహిరంగ ప్రకటనా చేయలేదు. ఇప్పుడు మీ అందరికీ ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. తన కోచింగ్ వ్యవహారశైలి కాస్త కఠినంగా ఉంటుందని లాంగర్ చెప్పుకొన్నాడు. అందుకు అతడు ఆటగాళ్లకు, ఇతర సహాయ సిబ్బందికీ క్షమాపణలు చెప్పాడు. అయితే, అంత అవసరం లేదనిపించింది. ఎందుకంటే మేమెప్పుడూ దాన్ని కఠినమైన శిక్షణగా భావించలేదు. మాకు అది అసలు సమస్యే కాదు. అయితే, ఇప్పుడు మేమున్న అత్యుత్తమ దశలో కొత్త కోచ్ కావాలని అనుకుంటున్నాం. మా ఆటగాళ్లు కూడా ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బోర్డు కూడా అతడి రాజీనామాను అంగీకరించింది’ అని కమిన్స్ వివరించాడు.
కాగా, లాంగర్ 2018లో ఆ జట్టు కోచింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. ఆ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ క్రమంలోనే ఆసీస్ రెండు సార్లు భారత్ చేతిలో బోర్డర్-గావస్కర్ సిరీస్‌లు కోల్పోయింది. అయితే, ఇటీవల టీ20 ప్రపంచకప్ గెలవడం, ఇంగ్లాండ్‌పై యాషెస్ సిరీస్ గెలవడం విశేషం.
Tags:
Sports